Shodasi : Ramayana Rahasyamulu By Gunturu Seshendra Sharma (Telugu) - 2017
సుమారు 45 ఏళ్ళ క్రితం అచ్చయిన ఈ మహా కావ్యం అంతగా జన బాహుళ్యంలో ప్రాచుర్యానికి నోచుకోలేదు. శేషేంద్ర దానికి పూనుకోకపోవడమే ప్రధాన కారణం.
ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన 3వ ప్రచురణతో కొంత వెలుగులోకి వచ్చింది. కొన్ని సమీక్షలు వెలువడ్డాయి. మళ్ళీ 2013లో వెలువడ్డ ప్రచురణతో కాస్త ప్రజల్లోకి వెళ్ళింది.
ఈ 45 ఏళ్ళలో వచ్చిన విభిన్న సమీక్షలతో సమగ్రంగా సర్వాంగ సుందరంగా షోడశి మన ముందుకు వస్తోంది.
* * *
మానవాళికో పరమౌషధం... వాల్మీకీ ‘రామాయణం’
రామాయణం కథ ఒక పాఠ్యాంశంగా పిల్లల చేత చదివిస్తారు. సీతారాముల్ని ఆదిదంపతులుగా పెద్దలు కొలుస్తారు. ఇక పారాయణం సంగతి చెప్పనక్కర్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఒక సులభమైన కథగా చెప్పి ఊరుకున్నాడా? కాదంటున్నారు శేషేంద్రశర్మ.
వాల్మీకి రామాయణం అంతరాత్మ అవగతం అవడానికి శాస్త్ర పరిజ్ఞానం అవసరమని, అందులో రహస్యంగా దాగి వున్న రుషి హృదయం. శాస్త్ర పరిజ్ఞానం ద్వారానే ఆకళింపునకు లొంగుతుందని విశ్లేషించారు. మరి శాస్త్ర పరిజ్ఞానం అందరికీ అందేది కాదు కదా!
‘‘శాస్త్రములు పండితుల కొరకే’’ అన్న వాదం ‘‘కొందరు స్వార్థపరులైన పండితులు, కొందరు సోమరులైన పామరులు కలిసి చేసిన కుట్ర, కల్పించిన భ్రాంతి’’ అన్నది శేషేంద్రగారి నిశ్చితాభిప్రాయం. సాహిత్యం, శాస్త్రం పట్ల ఇలాంటి నిజాయితీ యుతమైన ప్రజాస్వామిక దృక్పథం ఉన్న శేషేంద్ర రామాయణంలో వాల్మీకి దాచిన రహస్యాల్ని ప్రజానీకానికి విడమరిచి చెబుతున్నారు. వాల్మీకి మహర్షి కుండలినీ యోగమనే పరమౌషధాన్ని మానవాళికి బహూకరించాడని, అనుష్టుప్ ఛందస్సులో ఉన్న వాల్మీకి కవిత ఆ ఔషధానికి తేనెపూత అనీ అనన్య అంతర్మథనంతో, అసాధారణ విద్వత్తుతో వ్యాఖ్యానించారు. రామాయణంలో వాల్మీకి ధ్యాన పద్ధతిని ప్రతిపాదించాడని, రామాయణం భారతంకంటే పూర్వ గ్రంథమనీ, వేదానికి రూపాంతరమనీ తేల్చి చెప్పారు. శేషేంద్రలోని అంతర్ముఖత్వం, పరిశీలాన్వేషణా చాతుర్యం రెండు పాయలుగా గ్రంథమంతటా విస్తరించాయి. ప్రతిభా పాండిత్యాల పారవశ్య పరిమళం గ్రంథమంతటా గుబాళిస్తుంది. ఋతుఘోష వంటి అరుదైన పద్యకావ్యం, మండే సూర్యుడు వంటి సంచలనాత్మక వచన కవితా సంకలనం వెలువరించిన శేషేంద్రలోని మంత్ర శాస్త్రం, వేదవాంగ్మయంలో విద్వాంసుడన్న కోణం ఈ గ్రంథం ద్వారా నేటితరం వాళ్ళు తెలుసుకోవచ్చు.