Konamgi (Telugu) - 2015
తన పెద్ద కళ్ళెత్తి ''నే నందంగా లేనా?'' అని ప్రశ్న వేసింది.
''నువ్వు అందానికే అచ్చుతప్పులు దిద్దేటంత అందంగా ఉన్నావు.''
''నువ్వు కోటు మార్చుకోలేదేమి?''
''మార్చుకొన్నా! అంటే తిరిగి మార్చాను. అంటే మార్చినంతపని చేశాను. ఉన్నది ఒక్కకోటే అవడంచేత, ఒకమాటు విప్పి తొడగడం చేతనే, మార్చినట్లు! సబ్ కలెక్టరును మార్చమని ప్రజలు ప్రభుత్వానికి అర్జీ పెట్టితే, అతన్ని ఆ జిల్లాకే కలెక్టరుగా వేస్తే ఎంతో బాగా మార్చినట్లే గదా!''
''నువ్వు చెప్పింది నిజమే కోనంగిరావ్!''
ఇద్దరూ టీ తాగారు. బయలుదేరి వెళ్ళి కారెక్కి సినిమాకు వెళ్ళారు.
అంతకుముందే సీతాదేవి మూడురూపాయల టిక్కెట్లు రెండు తెప్పించి ఉంచింది. ''నువ్వు నా అతిథివి కోనంగిరావూ!'' అని ఆమె అంది.
''కాకపోరునా మన పర్సు ఖాళీగా, సీతాదేవీ!''
''అన్నీ గమ్మత్తుమాటలే నీవి!''
''నిజం చెబుతున్నాను.''
''నేను నమ్మను.''
''నువ్వు దగ్గిరుంటే నాకూ నమ్మకంలేదు.''
''నువ్వు చాలా ధనవంతుడవని మా డాడీ చెప్పాడు''.
- Author: Adavi Bapiraju
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 392 pages
- Language: Telugu