Sri Manidweepa Varnana (Telugu)
Regular price
₹ 10.00
మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.
ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి.
ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి.
-
Author: Puranapanda Radhakrishna Murthy
- Publisher: Mohan (Latest Edition)
- Language: Telugu