Kavitha Vyjayanthi (Telugu) - 2015
ఒక లక్షమంది తెలుగు బోధకులుంటే వారిలో వెయ్యిమంది కవులు ఉంటారు. వారిలో కనీసం వందమంది పద్య కవులుంటారు. వారిలో ఒక యాభై మందివి వాసిలోనూ రాసిలోనూ ప్రచురణ యోగ్యాలుంటాయి. అయితే పదిమందివి కూడా ప్రచురణ భాగ్యానికి నోచుకోవడం లేదు. సొంతంగా ప్రచురించుకొనే స్తోమత ఈ కవులకు లేకపోవడం, ప్రచురణ కర్తలు ముందుకు రాకపోవడం - ఇలాంటి కారణాలు అటుంచితే, ఇప్పుడు ఎవడికి కావాల్లే మన పద్య కవిత్వం అని ఈ కవులకు ఉన్న నిస్పృహ ఒకటి అన్నిటికంటే పెద్ద కారణం. గెడ్డాపు సత్యంగారు కూడా ఇదే బాపతు. ఎన్ని పద్యాలు! ఎంత పరిణతమైన ప్రౌఢ కవిత్వం! పుత్ర రత్నాల సైన్సు రికార్డుల్లో ఒకవైపు ఖాళీగా ఉన్న పుటల మీద రాసేసి, ఇంటిలో ఎక్కడెక్కడో తోసేసి, నిశ్చింతా దీక్షితుల్లా కూర్చున్న స్థితప్రజ్ఞు డీయన. కాకపోతే ఒక్క విషయంలో అదృష్టవంతు డీయన. తండ్రి గారి విద్య పట్ల గౌరవం ఉండి, పద్య కవిత్వ సార వివేచన చెయ్యగల ప్రజ్ఞ ఉన్న కొడుకు ఉండడం, అతడు తండ్రి కవిత్వానికి ముద్రిత రూపాన్నివ్వాలనే ఆశయం కలిగినవాడు కావడం ముమ్మాటికీ సత్యంగారి అదృష్టం.
- Author: Geddepu Satyam
- Publisher: Emesco Books (Latest Edition)
- Paperback: 168 pages
- Language: Telugu