Sri Saraswathi Jnananidhi (Telugu)
Sri Saraswathi Jnananidhi (Telugu)
వీణాధరి అంటే సరస్వతి. ఆ దేవత వీణానాద దివ్య ధ్వని సప్త స్వర ప్రతిభకు మూలం. ఆమె వీణను విపంచి అంటారు. ఆమె చిత్తరువు, మూర్తి, స్తోత్రం… వీణ ప్రస్తావన లేకుండా వ్యక్తం కాదు. సరస్వతీ దేవే కాక పరాశక్తి హస్తాల్లో సైతం వీణ కనపడుతుంది. కాళిదాసు రాసిన నవరత్న మాల స్తోత్రంలో పరాశక్తి వజ్రపుటుంగరం ధరించిన వేలితో మంజుల నాదం సృజిస్తూ (సరిగమపదని రతాంతాం వీణా సంక్రాంత కాంతా హస్తాంతాం) శ్రావ్యతకు కారణమవుతున్నదంటాడు. మాతంగిదేవిని సైతం శ్రుతుల్లో ‘వీణ సంక్రాంత చారు హస్తా’ అని స్తుతించారు. మాతంగి దేవిని వీణకు ప్రతిరూపంగా భావిస్తారు. అత్యాదరంగా వీణను వాయిస్తూ ఈ దేవిని స్మరించాలంటారు. మాతంగి షట్కమ్‌లో వీణను గురించిన ప్రస్తావనే అధికంగా వినిపిస్తుంది. వీణ రసానుషాంగం, వామ కుచ నిహిత వీణం లాంటి వాక్సరణులు కనిపిస్తాయి. శ్యామల దండకం ‘మాణిక్యవీణా ముపలాలయంతీమ్’ అంటూ ప్రారంభమవుతుంది.
శివుడికి వీణానాదం అంటే చాలా ఇష్టం. ‘మోక్షముగలదా జీవన్ముక్తులు కానివారలకు (సారమతి) కీర్తనలో… వీణావాదనలోలుడౌ శివ మనోవిధమెరుగరు’ అన్నాడు. ప్రణవనాదం ప్రాణ, అగ్ని సంయోగం పొంది సరిగమపదని అనే సప్త స్వరాలుగా విభక్తమవుతాయని త్యాగరాజు ఈ కీర్తనలో వివరిస్తాడు. సుషుమ్న నాడిలో వీణ ప్రక్రియలు ఉన్నాయని యోగవాసిష్టం చెబుతోంది. శివమూర్తి, శ్రీదక్షిణామూర్తి అనే రూపాలు శివుడికి ఉన్నట్లే వీణా దక్షిణామూర్తి అనే శివ రూపాన్ని సైతం కొలుస్తారని అంటారు. పల్లవులు, చోళులు నిర్మించిన దేవాలయాల్లో దక్షిణామూర్తి వీణను ధరించి కనపడతాడు. అందుకే ఆయనను వీణా గానప్రియ అని సైతం స్తుతిస్తారు. వీణను వాయించడంలో దక్షిణామూర్తి ప్రవీణుడని ప్రఖ్యాత తమిళ కవి అప్పర్ తన తమిళ కావ్యం ‘తిరువిళాయాదల్ పురాణం’లో పేర్కొన్నాడు. దక్షిణామూర్తి వీణలోనుంచి ఉద్భవించే సార్వజనిక నాదం ద్వారానే జ్ఞానాన్ని జిజ్ఞాసువులకు అనుభవానికి తెస్తాడని శివపురాణం వివరిస్తోంది.
ఎందరో దివ్య మునులు సైతం వీణా వాదకులని వాంగ్మయాలు చెబుతున్నాయి. నారదుడి వీణ పేరు మహతి. ‘శ్రీ నారద నాద సరసీ రుహ భృంగ శుభాంగ (కానడ) కీర్తనలో త్యాగయ్య… వేద జనిత వరవీణా వాదన తత్వజ్ఞా’ అని పురాణ ఇతిహాసాల్లోని నారదుడి పాత్రను కొనియాడాడు. అగస్త్యుడికి, రావణుడికి వీణా వాదనలో పోటీ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. మంత్రాలయం రాఘవేంద్రస్వామి గొప్ప వీణా విద్వాంసుడు. ఆయన బృందావనంలోకి ప్రవేశించే ముందు, భైరవి రాగంలో ‘ఇందు ఏనకే గోవిందా’ అంటూ వీణ మీటుతూ కన్నడ భాషలో గానం చేశారట. ఆయన సదా పూజించే బంగారు సంతాన గోపాలమూర్తి విగ్రహం ఆ గానానికి పరవశం చెంది సజీవ చైతన్యంతో నాట్యం చేశాడని, క్రీ.శ.1671లో ఈ అపూర్వ సంఘటన జరిగిందని చెబుతారు. పదమూడో శతాబ్దానికి చెందిన గొప్ప సంగీతజ్ఞుడు సారంగదేవుడు రచించిన సంగీత రత్నాకరంలో వీణానాదం వల్ల దుష్కర్మ పాపాలు తొలగిపోతాయని పేర్కొన్నాడు.
వీణ భాగాలను కుండ దండి యాళి బుర్ర అనే నాలుగు భాగాలుగా విభజించారు. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులను వీణకు బిగిస్తారు. పక్కన శ్రుతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు. ఈ వాద్యానికి ఇరవై నాలుగు మెట్లు ఉంటాయి. పనస చెట్టు నుంచి సంగ్రహించిన వీణసారె వీణ తయారీలో ప్రధానమైన భాగం. వీణ సరస్వతి దేవి హస్త భూషణం కనుక వైణికులు ఈ జంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పూజిస్తారు.
- Author: Adipudi Sairam
- Publisher: Mohan Publications
- Language: Telugu