Adhunika Mahabharatam (Telugu) By Gunturu Seshendra Sharma
ముఖ్య వివరణ
ఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా వెలువడింది. 1984 – 86 వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో శేషేంద్ర జాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి. వీటికి అరుస్తున్న ఆద్మీగా పేరుపెట్టారు. ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వంగా చేర్చారు. శేషేంద్ర ఆధునిక మహాభారతం వ్యాస విరచిత భారతానికి ఏ సంబంధం లేదు. శేషేంద్ర మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం. ఫలితంగా శేషజ్యోత్స్న జ్యోత్స్నపర్వంగా, నా దేశం నా ప్రజలు ప్రజా పర్వంగా, మండే సూర్యుడు సూర్యపర్వంగా, గొరిల్లా పశు పర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహాపర్వంగా, సముద్రం నా పేరు సముద్రపర్వంగా, ఇందులో రూపొందాయి.
"ఇది నా కావ్య సంకలనం కాదు ఇది నా కావ్యం నా సంపూర్ణ కావ్యం. కవి అనేక కావ్యాలు రాయడు. కవి ఒకే మనిషి – ప్రవహిస్తున్న ఒకే జీవితం జీవిస్తాడు అలాగే ఒకే కావ్యం రాస్తాడు... జీవితం ఒక యాత్ర; యాత్ర అనేక మజిలీల ప్రయాణం. దీని అర్థాంతరమే, కవి కావ్యయాత్ర అనేక కృతుల సాముదాయిక స్వరూపం. అంటే ఒక కవి తన జీవితంలో ఒకే కావ్యం రాస్తాడు అయితే దాన్ని అప్పుడప్పుడూ క్రమక్రమంగా రాస్తూ ఉంటాడు. అలా రాయబడే ఒక్కో కృతి నిజంగా పూర్ణకృతి కోసం పుట్టే ఒక్కో పర్వం. కావ్యయాత్ర అంతిమ చరణంలో అన్ని పర్వాలూ కలిసి ఒక్క కావ్యం మాత్రమే అవుతుంది.
కనుక నేను నా జీవితంలో అనేక కావ్యాలు వ్రాయలేదు. రాశింది ఒకే కావ్యం. దాని పేరు నా దేశం నా ప్రజలు దాని వర్తమాన నామాంతరం ఆధునిక మహాభారతము. ఆ కావ్యం యొక్క భాగాలు నా జీవితంలో అప్పుడప్పుడూ రాస్తూవచ్చాను. భిన్నభిన్న నామకరణాలతో ఆ భాగాల్ని అప్పుడప్పుడూ ప్రకటిస్తూవచ్చాను. ఆ భిన్నభిన్న నామకరణాలతో అప్పుడప్పుడూ వచ్చిన ఆ భాగాలే ఈనాడు నా ప్రజలకు సమర్పిస్తున్న సంపూర్ణ కావ్యంలో పర్వాలుగా ప్రత్యక్షమవుతున్నాయి. అవి పుట్టినప్పుడు నిజంగా చివరకు రూపొందే సమగ్రకావ్యం కోసం పుట్టిన తొలి అవయవాలే గనుక ప్రతి పర్వాంతంలో ఒక పగ ఉంది. పర్వాంతగద్య. ఈ ఆధునిక మహాభారతానికి జనవంశమనే అనుబంధ కావ్యం ఒకటి ఉంది. ఇంతటితో నా కావ్యయాత్ర ముగిసింది "
విప్లవ వస్తువు ఆధునిక రూపకళా సృష్టిలో లీనం చేసి భారతీయ చషకంలో పోసి ఒక అపూర్వ మిలన మాధురి ఇచ్చిన శేషేంద్ర ఆసియా ఐరోపాల మధ్య వేసిన ఇంద్రధనుస్సేతువు. ఈయనలోనే తెలుగుకవిత విప్లవబింబసృజనలో శిఖరాగ్రాలు అందుకుంది. కనుక ఆయన ఒక నూత్నకవితామార్గకర్త. శేషేంద్రను చదవడం విప్లవ సంగీతాన్ని వినడమే. ఏ సంగీతం కర్మాచరణ ప్రేరకమో, మహోత్తేజ దాయకమో – దాన్ని; ఆ అనుభూతి ఒక సుగంధిల స్వప్నం, ఒక పూలతీగ, ఒక కొండవాగు. ఇలా ప్రతీకలుగా చెపుతూ పోవలసిందే తప్ప వేరే మార్గం లేదు. శేషేంద్ర కవిత్వమంతా లావాప్రవాహం లాంటి ప్రతీకల స్రోతస్సు.
ఇంత వరకూ సాహిత్యంలో ప్రముఖులు శేషేంద్ర కావ్య వాక్యాలు పేర్కొంటూ వస్తున్నారు . కానీ ఈ మధ్య చలన చిత్ర ప్రముఖులు కూడా చాలా మంది శేషేంద్ర కవితల్ని జండాలుగా ఎగరేస్తున్నారు . వీరికి లీడర్ తెలుగు సినిమా గబ్బర్ సింగ్ శ్రీ పవన్ కళ్యాణ్ . వీరు అంటించిన సీమ టపాకాయల సరం క్రమంగా అన్నిదిక్కులా పేలుతోంది . మొన్న ఈ మధ్య ఒక దిన పత్రికకిచ్చిన ఇంటర్వ్యూ లో సూటిగా ఆధునిక మహాభారతం ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్ . ఎంతో కాలంగా పునర్ముద్రణ కోసం ఎదురు చూస్తున్న ఈ కావ్యేతిహాసాన్ని కవి కుమారుడు సాత్యకి మహా కవి శేషేంద్ర 9వ వర్ధంతి కానుకగా తెలుగు సాహితీ ప్రజానీకానికి బహూకరిస్తున్నారు .